BRICS media kit: బిహార్ సత్తు నుంచి కోరాపుట్ కాఫీ వరకు.. బ్రిక్స్ మీడియా కిట్‌లో ఏమున్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే సత్తు, ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో పండే కాఫీ, గుజరాత్ సంప్రదాయ హస్తకళలు.. ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికైన బ్రిక్స్ సదస్సులో భారతీయ వైవిధ్యాన్ని చాటుతున్నాయి. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి జర్నలిస్టులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి అందిస్తున్న మీడియా కిట్ కేవలం సమావేశ వివరాలకే పరిమితం కాలేదు. దేశంలోని భిన్న ప్రాంతాల ఆహార సంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులు, శతాబ్దాల నాటి హస్తకళలను పరిచయం చేసేలా దీనిని రూపొందించారు.
వివరాలు
విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA)నేతృత్వంలో ఈ మీడియా కిట్‌ను సిద్ధం చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన ఉత్పత్తుల ద్వారా భారతీయ ఆహార,సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ మీడియాకు పరిచయం చేయాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
మీడియా కిట్ల రూపకల్పన,సదస్సు ఏర్పాట్లపై వార్తా సంస్థ ANIతో మాట్లాడిన MEA ప్రజా సంబంధాల విభాగం OSD వాసుదేవ్ రవి..దేశంలోని వైవిధ్యాన్ని చాటుతూ 'ఇండియా స్టోరీ'ని ప్రపంచానికి వివరించడమే లక్ష్యమని తెలిపారు.
"భారతీయ కథను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది మంచి అవకాశం.దేశంలోని ప్రత్యేకతలను మన మీడియా సహచరులతో పాటు అంతర్జాతీయ పత్రికా ప్రతినిధులకు కూడా తెలియజేయాలనుకున్నాం.అందుకే మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంప్రదాయ ఆహార ఉత్పత్తులను పరిచయం చేసే ప్రయత్నం చేశాం"అని వాసుదేవ్ రవి వివరించారు.
వివరాలు
మూడు రాష్ట్రాల నుంచి ప్రత్యేక ఉత్పత్తులు
మీడియా కిట్‌లో దేశంలోని మూడు విభిన్న ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులకు చోటు కల్పించారు.
బిహార్: సత్తు, మఖానా
ఒడిశా: కోరాపుట్‌లో పండే కాఫీ
గుజరాత్: సంప్రదాయ హస్తకళలు
బిహార్ ప్రభుత్వం అందించిన సత్తు, మఖానా గురించి వాసుదేవ్ రవి మాట్లాడుతూ.. "బిహార్ ప్రభుత్వ సహచరులు సంప్రదాయ పానీయమైన సత్తుతో పాటు రాష్ట్రంలో విస్తృతంగా లభించే ప్రముఖ ఉత్పత్తి మఖానాను అందించారు. ఒడిశా ప్రభుత్వంతో కలిసి కోరాపుట్ కాఫీని పరిచయం చేస్తున్నాం. గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని నైపుణ్యాన్ని, హస్తకళా సంప్రదాయాలను చాటేలా వివిధ రకాల కళాకృతులను అందించింది. భారతదేశాన్ని, 'ఇండియా స్టోరీ'ని ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రయత్నం" అని పేర్కొన్నారు.
వివరాలు
ఆహారం నుంచి హస్తకళల వరకు..
బిహార్‌లో సంప్రదాయంగా పానీయంగా తీసుకునే సత్తు.. ఆ రాష్ట్ర ప్రత్యేక ఆహార సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.
అదే రాష్ట్రానికి చెందిన మఖానా కూడా ప్రముఖ వ్యవసాయ,ఆహార ఉత్పత్తుల్లో ఒకటి.
మరోవైపు కోరాపుట్ కాఫీ.. ఒడిశాలో అభివృద్ధి చెందుతున్న కాఫీ రంగానికి ప్రతినిధిగా నిలుస్తోంది.
గుజరాత్ హస్తకళలు ఆ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ కళా,చేతివృత్తుల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఇలా సత్తు,మఖానా, కాఫీ, హస్తకళలను ఒకే కిట్‌లో చేర్చడం ద్వారా భారతదేశంలోని ప్రాంతీయ గుర్తింపులను సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జర్నలిస్టులు దేశాన్ని కేవలం దౌత్య చర్చల ద్వారా మాత్రమే కాకుండా.. స్థానిక ఆహారాలు, ఉత్పత్తులు, సంప్రదాయ కళల ద్వారా కూడా అనుభవించే అవకాశం ఈ మీడియా కిట్ కల్పిస్తోంది.