Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సభా కార్యక్రమాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సెషన్‌లో నాలుగు బిల్లులను పరిశీలించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే జీ20 సదస్సు విజయవంతం కావడం, చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్', దేశం పేరును 'భారత్'గా మార్చే అంశాలపై చర్చించవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ఇదే
పాత పార్లమెంట్ హౌస్‌లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19న పాత పార్లమెంట్ హౌస్‌లోనే ఫొటో సెషన్ ఉంటుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఆ తర్వాత ఉభయ సభల ఎంపీ కొత్త పార్లమెంటు భవనానికి చేరుకుంటారు. సెప్టెంబరు 19 నుంచి కొత్త భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 17) ఉదయం కొత్త పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్త పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులకు ఇప్పటికే గదుల కేటాయింపు జరిగింది. వారికి సమాచారం కూడా అందించారు. ఇందులో పై అంతస్తు, మొదటి అంతస్తులో మంత్రులకు గదులు కేటాయించారు.
ఏయే అంశాలపై చర్చిస్తారు, ఏయే బిల్లులు ప్రవేశపెడతారు?
ప్రత్యేక సమాశాల్లో చర్చించే అంశాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే తాత్కాలిక ఎజెండాను విడుదల చేసింది. అందులో 75 సంవత్సరాల పార్లమెంటు ప్రయాణం గురించి చర్చించనున్నట్లు కేంద్రం చెప్పింది. అలాగే పార్లమెంటు పర్యటనలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న విషయాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన నిబంధనలతో కూడిన బిల్లు కూడా ఆమోదం కోసం ఎజెండాలో చేర్చారు. వర్షాకాల సమావేశాల్లో దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్, జర్నల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు 2023ను చర్చించే జాబితాలో చేర్చారు. పోస్టాఫీస్ బిల్లు 2023ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును 10 ఆగస్టు 2023న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఇప్పటి వరకు ఏడుసార్లు ప్రత్యేక సమావేశాలు
వాస్తవానికి రాజ్యాంగంలో 'ప్రత్యేక సెషన్' అనే ప్రస్తావన లేదు. అయితే ముఖ్యమైన శాసనాలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సంఘటనలు, పరిస్థితులలో రాష్ట్రపతి ఆదేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలకు పిలువొచ్చు. ప్రత్యేక సెషన్‌లో ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించడం తప్పనిసరి కాదనే నియమం ఉంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. వీటిలో 1977లో మొదటి ప్రత్యేక సెషన్, 1991లో రెండో సెషన్, 1992లో మూడో సెషన్, 1997లో నాల్గవ సెషన్, 2008లో ఐదో సెషన్, 2015లో ఆరో సెషన్, 2017లో ఏడో సెషన్ నిర్వహించారు.