
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గద్దర్ ప్రజా పార్టీతోనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రజాగాయకుడు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరో నూతన రాజకీయ పార్టీ పుట్టింది. ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
ఇందులో భాగంగానే గద్దర్ ప్రజా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు కొత్త పార్టీని రిజిస్టర్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.
సీఈసీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.
77 ఏళ్ల వయసులో ప్రజా పార్టీ ఏర్పాటు చేశానని, ఇది ప్రజల తరఫున నిలిచే పార్టీ అని గద్దర్ స్పష్టం చేశారు.
ఈ దేశం, రాజ్యాంగం ప్రకారమే నడవాలని ఆయన ఆకాంక్షించారు.
DETAILS
దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలి: గద్దర్
ఈ సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ పై గద్దర్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కాలేదన్నారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ పుచ్చిపోయిన తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ తెచ్చి రాష్ట్రంలోని భూములు మింగారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడిచినా, ప్రజలు ఆశించిన రీతిలో పరిపాలన సాగలేదన్నారు.
రాష్ట్రంలో దొరల పరిపాలన మాత్రమే జరుగుతోందని, ప్రజా పాలన సాగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జీవించే హక్కు సైతం లేకుండా పోయిందన్న గద్దర్, దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలని ప్రజాపార్టీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
DETAILS
నా వెనుక కోట్లాది మంది ప్రజా బలం ఉంది : గద్దర్
ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజల వద్దకే వెళ్తున్నట్లు గద్దర్ అన్నారు. రాష్ట్రంలోని పల్లె పల్లెకు వెళ్తానని, పార్టీ నిర్మాణం చేస్తానన్నారు.
ప్రజల జెండానే తన ఎజెండా అని, ఓటు ప్రలోభాల నుంచి ఓటర్ ను కాపాడటమే తన లక్ష్యమని వివరించారు.
రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానన్న గద్దర్ , తన పార్టీ ఎవరితో కలవాలి, ఎలా వెళ్లాలనే అంశంపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు.