రేపు రైల్వే కోచ్ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలో రైల్వేకోచ్ పరిశ్రమ రానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా ఇది పేరుగాంచింది. సుమారు రూ.1000 కోట్ల మెగా పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఈ పరిశ్రమ నిర్మాణానికి 2020 ఆగస్టు 13న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తాజాగా 25 ఎకరాల్లో నిర్మాణాలు ప్రారంభిస్తూ ప్రాథమికంగా కోచ్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.
వందే భారత్ రైళ్లకు భోగీలను అందిస్తున్న మేధా సర్వో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
వందే భారత్ రైళ్లకు కావాల్సిన బోగీలను ఈ సంస్థే తయారు చేసి రైల్వేశాఖకు అందిస్తోంది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న 2 వందే భారత్ రైళ్లకు ఇక్కడ తయారు చేసిన కోచ్ లనే బిగించారు. ఈ క్రమంలో మొత్తంగా 160 బోగీలను రైల్వేకు తమ కంపెనీ సరఫరా చేసిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పరిశీలించారు.