Karnataka: బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి.. బీజేపీలో కెఆర్‌పిపి విలీనం
లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో ఆయన తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పిపి)ని బీజేపీలో విలీనం చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా పార్టీ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీని బీజేపీలో విలీనం చేసి తానే స్వయంగా ఆ పార్టీలో చేరానన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యేలా బీజేపీ కార్యకర్తగా పని చేస్తానని నిబద్ధత వ్యక్తం చేశారు.
28 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుంది: యడ్యూరప్ప
ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, పార్టీలో ఎలాంటి పదవుల కోసం తాను ఆశించడం లేదని స్పష్టం చేశారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి దంపతులు బీజేపీలో చేరడం సానుకూల నిర్ణయమని, రెడ్డి చేరిక వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.