యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు.దీంతో నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో కన్నుమూశాడు. విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన యాకూబ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.14 ఏళ్ల కుమారుడు షావాజ్, ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటి పక్కన ఆడుకుంటుండుగా ఓ పెంపుడు కుక్క షావాజ్ ను కరిచింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని ఎవరికీ చెప్పలేదు. సెప్టెంబర్ 1న బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.ఆహారం కూడా సరిగ్గా తినకుండా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు కుటుంబం గుర్తించింది.
అంబులెన్స్‌లోనే తండ్రి ఒడిలో ప్రాణం విడిచిన బాలుడు షావాజ్
కొన్నిసార్లు బాలుడు కుక్క మొరిగినట్లుగా శబ్దాలు చేసేవాడని పసిగట్టిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురైన కారణంగా ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించిందని వైద్యులు నిర్థారించారు. బాలుడికి వ్యాధి నయం కావాలని కుటుంబ సభ్యులు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కుదురుకోలేదు. అలా పలు ఆస్పత్రుల్లో చూపిస్తున్న క్రమంలో షావాజ్ అంబులెన్స్‌లోనే తండ్రి ఒడిలో ప్రాణం విడిచాడు. దీంతో పెను విషాదం చోటు చేసుకుంది. తీవ్ర శోకంతో బాధిత తండ్రి తన కుమారుడు మరణించాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. తన కొడుకును తన పక్క ఇంటి వద్ద ఉండే కుక్క బలి తీసుకుందని విలపించారు. సదరు కుక్కను పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం డిమాండ్ చేసింది.