
Nepal: నేపాల్‌లో హోటల్‌కు నిప్పు పెట్టిన నిరసనకారులు.. భారత మహిళ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన నిరసనలు ఆందోళనాత్మకంగా మారి హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో,దేశ రాజధాని కాఠ్మాండూ లోని పార్లమెంట్ భవనం,అధ్యక్ష నివాసం,ప్రధాన మంత్రి నివాసం తదితర ప్రభుత్వ కట్టడాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈభారీ నిరసనలు సాగుతున్న సమయంలో,భారత్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఘజియాబాద్ జిల్లా వాసులు రాజేష్ దేవి గోలా (57),రాంవీర్ సింగ్ గోలా ఈ సెప్టెంబర్ 7న నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించేందుకు వెళ్లారు. వారు కాఠ్మాండూ నగరంలోని హయత్ రీజెన్సీహోటల్‌లో తమ వసతి ఏర్పాటుచేశారు. అయితే, నేపాల్‌లో ఉద్రిక్తతలు గడిచిన రోజుల్లో తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి.
వివరాలు
నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకిన భారతీయ దంపతులు
సెప్టెంబర్ 9న రాత్రి సమయంలో ఆందోళనకారులు భారతీయ దంపతులు ఉన్న హోటల్‌ను చుట్టుముట్టి నిప్పంటించారు. అగ్నిమాపక శాఖ యంత్రాంగం మంటలను అదుపుచేయడానికి యత్నించినప్పటికీ,పరిస్థితులు కంట్రోల్ తప్పిపోయాయి. దాంతో, మంటల నుంచి తప్పించుకునేందుకు ఇతర వ్యక్తులతో కలిసి భారతీయ దంపతులు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ దారుణ ఘటనలో భార్య రాజేష్ దేవి గోలా మృతి చెందగా,భర్త రాంవీర్ సింగ్ గోలా తీవ్ర గాయాలతో సహాయక శిబిరానికి తరలించారు. ఈ కష్ట సమయంలో నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందలేదని ఉత్తరప్రదేశ్‌లోని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ తల్లి మృతి గురించిన వివరాలను కూడా అధికారులు కుటుంబానికి తెలియజేయలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.
వివరాలు
కాఠ్మాండూ,లలిత్‌పుర్,భక్తపుర్ నగరాల్లో నిషేధాజ్ఞలు
నేపాల్‌లో సోమవారం ఉదయంగా ప్రారంభమైన ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 34 మంది మరణించినట్లు తెలియ వచ్చింది. 1,338 మంది గాయపడ్డారు. రామెచ్చాప్ జిల్లా జైలు వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మరణించగా,13 మంది గాయపడ్డారు. కాఠ్మాండూ,లలిత్‌పుర్,భక్తపుర్ నగరాల్లో నిషేధాజ్ఞలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. 5 నుంచి 7 గంటల వరకు తాత్కాలిక ఉపశమనం కల్పించిన పోలీసులు రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మళ్లీ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం దేశమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది.