Page Loader
Goa Beach: అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 'తగ్గడానికి' ఇడ్లీ-సాంబార్ కారణం: గోవా ఎమ్మెల్యే  
అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 'తగ్గడానికి' ఇడ్లీ-సాంబార్ కారణం: గోవా ఎమ్మెల్యే

Goa Beach: అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 'తగ్గడానికి' ఇడ్లీ-సాంబార్ కారణం: గోవా ఎమ్మెల్యే  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవాలో ఇటీవల పర్యటకుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీచ్‌ల వద్ద ఇడ్లీ-సాంబార్, వడా పావ్ వంటి చిరుతిండ్లు విక్రయించడమే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నార్త్ గోవాలోని కలంగూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. "బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారులు బీచ్ ప్రాంతాల్లో వడా పావ్ అమ్ముతున్నారు, మరికొందరు ఇడ్లీ-సాంబార్ విక్రయిస్తున్నారు.గత రెండు సంవత్సరాలుగా గోవాకు వచ్చే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ఒక ముఖ్య కారణంగా మారింది.ఈ పరిణామం స్థానికంగా తీవ్రమైన ఆందోళనకు దారితీస్తోంది,"అని లోబో పేర్కొన్నారు.

వివరాలు 

అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలి

అయితే, పర్యాటక రంగంపై ఇడ్లీ-సాంబార్ విక్రయాలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయనేది ఆయన స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ,పర్యాటక సంఖ్య తగ్గడానికి అనేక అంశాలు కారణమని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావంతో ఆ దేశాల పర్యటకులు గోవా రావడం మానేశారని అన్నారు. పర్యాటకులను ఆకర్షించడంలో ప్రభుత్వం ఒక్కటే బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని లోబో సూచించారు.

వివరాలు 

 ట్యాక్సీలు, క్యాబ్‌ల మధ్య సమస్యలు 

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గోవా ప్రజలు తమ దుకాణాలను అద్దెకు ఇచ్చేయడం కూడా సమస్యగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి గల అసలు కారణాలను విశ్లేషించేందుకు టూరిజం శాఖతో పాటు సంబంధిత భాగస్వామ్యులు కలిసి చర్చించాలని అన్నారు. అంతేకాకుండా,స్థానిక ట్యాక్సీలు, క్యాబ్‌ల మధ్య కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించకపోతే గోవా పర్యాటక రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.