Page Loader
Bhadrachalam: భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద

Bhadrachalam: భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాచలం ప్రాంతంలో గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి వరకూ నది నీటిమట్టం 20అడుగుల వద్ద ఉండగా, బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇది 24 అడుగుల పైకి వెళ్లింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు గోదావరిలో చేరుతోంది. గోదావరి వరద ప్రభావంతో భద్రాచలంలోని స్నానఘట్టాల కిందభాగం నీట మునిగిపోయింది. దీనివల్ల అక్కడ వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారులు, ముఖ్యంగా పూజా సామాగ్రి అమ్మకందారులు తమ స్టాల్స్‌ను కరకట్టపైకి తరలించుకున్నారు. ఇదే సమయంలో,భక్తులు భద్రాచలంలోని శ్రీ రామాలయాన్ని దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించడంతో దేవాలయ పరిసరాల్లోభారీ రద్దీ నెలకొంది. భక్తుల భద్రత దృష్ట్యా,అధికారులు ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

వివరాలు 

సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం 

నాగార్జునసాగర్ ప్రాంతానికి ఎగువ నుండి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం, శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 1,16,757 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో సాగర్ జలాశయంలోని నీటిమట్టం 535.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మరో 1,500 క్యూసెక్కులు - మొత్తం 4,646 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్నందున ప్రధాన డ్యాం ఎడమవైపున ఉన్న మట్టి కట్ట వరదనీటికి తాకుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.