Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు
రాష్ట్రంలో పెట్టుబడిదారుల సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో భాగస్వామ్యంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై నేరుగా చర్చించడానికి కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సీఐఐ ప్రతినిధులు ఫోరంను ఏర్పాటు చేయాలని కోరారు. ఆ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫోరాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫోరంలో మంత్రి నారా లోకేష్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు, అలాగే వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సీఐఐతో కలిసి పనిచేయాలని నిర్ణయం
ఈ ఫోరంను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ 2050 నాటికి ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఎదగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయివేటు రంగంతోనూ సమన్వయం చేసుకోవడానికి సీఐఐతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల అభివృద్ధికి అనుమతులను త్వరితగతిన ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఇవ్వనుంది. ఏపీ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ కార్యాలయంలోని ప్రజా వేదికకు ప్రతి రోజు ఫిర్యాదులు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో 60-70% రెవెన్యూ సమస్యలే కావడంతో, గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.