TG GOVT: నేతన్నలకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వ ఉత్తర్వులు!
ఈ వార్తాకథనం ఏంటి
చేనేత వృత్తిని నమ్ముకుని జీవించే నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన చేనేత రంగానికి కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తుందని స్పష్టంచేసింది.
గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతన్నలకు రుణమాఫీ హామీ ఇచ్చారు.
తాజాగా ఈ హామీని నెరవేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త అందించింది. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
రూ. 33 కోట్ల రుణాలను మాఫీ చేయనుండగా, ఒక్కో చేనేత కార్మికుడికి లక్ష రూపాయల వరకు రుణ మాఫీ వర్తించనుంది.
Details
పద్మశాలీలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రశంసించారు. తెలంగాణ కోసం పదవిని వదులుకున్న కొండా బాపూజీనే బీఆర్‌ఎస్‌కి పునాది వేశారు.
కానీ ఆయనను అనంతరం పూర్తిగా పక్కనపెట్టారు. పద్మశాలీలు దీన్ని గుర్తుంచుకోవాలి.
టైగర్ నరేంద్రను కూడా రాజకీయంగా చీకట్లో నెట్టేశారు. బతుకమ్మ చీరల బకాయిలతో నేతన్నలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోవద్దని సీఎం వ్యాఖ్యానించారు.
రాజ్యసభకు రాపోలు ఆనంద భాస్కర్‌ను పంపించి పద్మశాలీలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు.