
Ration Card: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది.
జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభించారు.
అయితే కొత్త కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో, ఫలితాలు మార్చి మొదటి వారంలో వెలువడనున్నాయి.
దీంతో మార్చి నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో రేషన్ కార్డుల్లో పేర్లు తొలగింపు, చేర్పించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
Details
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల ఎంపిక
గ్రేటర్ హైదరాబాద్‌లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జీహెచ్ఎంసీ అధికారులు మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లోనే వార్డు సభలు జరపాలని భావించినా ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తికాకపోవడంతో ఆలస్యమైంది.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకు 10,70,659 దరఖాస్తులు రాగా, అర్హుల గుర్తింపునకు సర్వే చేపట్టారు. అయితే ఈ ప్రక్రియ పూర్తికావటానికి మరో 10-12 రోజులు పట్టే అవకాశం ఉంది.
అందువల్ల, మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Details
అప్లికేషన్లు, అర్హతల ప్రక్రియ
గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డులకు 83,285 మంది దరఖాస్తు చేసుకోగా, 75,000 మందిని అర్హులుగా ఎంపిక చేశారు.
అయితే వార్డు సభలు జరగకపోవడంతో అధికారికంగా జాబితా ప్రకటించలేదు. ఇదివరకే దరఖాస్తు చేసినవారు, మీ సేవ కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో కొందరు పునరుద్ధరణకు మరోసారి దరఖాస్తు చేస్తున్నారు.
నగరవాసులు మాత్రం, లబ్ధిదారుల ఎంపిక పూర్తయినందున, వార్డు సభల కంటే ముందే అర్హుల జాబితాను ప్రకటించాలని కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరో రెండు వారాల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్న అధికారులు, రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమవుతున్నారు.