Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ఉచిత రేషన్ పథకం గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ మరో 5 ఏళ్లు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన పేర్కొన్నాడు. జనవరి 1, 2024 నుంచి ఈ పొడిగింపు వర్తిస్తుందన్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందనున్నారు.
ఐదేళ్ల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
గత ఛత్తీస్ గఢ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. పీఎంజీకేఓవై పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా మహమ్మారి లాక్ డౌన్ విధించిన క్రమంలో కేంద్రం ప్రకటించింది. మొదట మూడు నెలలు మాత్రమే ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత పలుమార్లు ఈ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు ఏకంగా మరో ఐదేళ్లు పాటు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్ 2028 వరకు ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందనున్నాయి.