Andrapradesh: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సొంతిల్లు కలను సాకారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. 2024-24 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కల్పించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించి లేదా పట్టాలు అందించనున్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అమలు చేయాలని నిర్ణయించారు, దీనికి (ప్రధానమంత్రి ఆవాస్ యోజన - ఎన్టీఆర్ నగర్ పథకం' అని పేరు పెట్టారు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లతో పాటు, అదనంగా 16 లక్షల ఇళ్లు లేదా పట్టాలు కొత్తగా కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన సుమారు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 1.79 లక్షల ఇళ్లు
పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 1.79 లక్షల ఇళ్లు, ప్రధానమంత్రి జన్‌మన్ కింద 15 వేల ఇళ్లను నిర్మించడానికి బడ్జెట్‌లో రూ.4,012 కోట్లు కేటాయించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల సమయంలో ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు ఇవ్వాలని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంతో, సొంతిల్లు కల కలగంటున్న మధ్యతరగతి ప్రజల ఆశలు మరింతగా పెరిగాయి.