Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకురావాలని ప్రతిపాదించిన 'క్రెడిట్ గ్యారంటీ ఫండ్' పథకం కింద చిన్న పరిశ్రమలకు లభించాల్సిన లబ్ధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్రం నుండి ఈ నిధి కోసం రూ.900 కోట్లు అందుతాయని ఆయన వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) కొరకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు అందించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు సహాయం అందించడం ఈ నిధి లక్ష్యం అని ఆయన చెప్పారు.
ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహానికి త్వరలో కొత్త విధానం
సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షలో, సీఎం చంద్రబాబు ఎంఎస్‌ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై చర్చించారు. ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహానికి త్వరలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రానున్న వారికి ప్రాథమిక సమాచారం అందించడానికి టీసీఎస్ రూపొందించిన 'ఎంఎస్‌ఎంఈ వన్' యాప్‌ను రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా చేస్తున్నామన్నారు. ఈ యాప్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం, జిల్లాలో పరిశ్రమల అవకాశాలు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి వివరాలను అందిస్తామన్నారు.
ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు
ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలని,మొత్తం 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీఐఐసీ నిధులతో అభివృద్ధి చేసిన పార్కుల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో చిన్న పరిశ్రమలకు ఇబ్బందిగా మారినట్లు చెప్పారు. పబ్లిక్,ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రతి నియోజకవర్గంలో మరో 50పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామని,మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కొంత నిధిని అందిస్తుందని వివరించారు. డ్వాక్రా సంఘాలను ఎంఎస్‌ఎంఈలు ప్రారంభించడానికి ప్రోత్సహిస్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్‌ను కేంద్రమే సాయంతో 'ర్యాంప్' కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభిస్తామని,ప్రతి జిల్లాలో ఎంఎస్‌ఎంఈలను రిజిస్టర్ చేయాలని,ఇందుకోసం సచివాలయంలో ఇండస్ట్రియల్ అసిస్టెంట్ సహకారంతో'ఉద్యమ్ సర్టిఫికెట్'అందుబాటులోకి తెస్తామని, వ్యాపారాభివృద్ధికి నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు.
అమరావతిలోనే టెక్నాలజీ సెంటర్
అమరావతిలో టెక్నాలజీ సెంటర్‌ను తిరిగి ఏర్పాటు చేస్తామని, కేంద్రం 10 అనుబంధ యూనిట్లను అందిస్తుందని చెప్పారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు ఆన్ జాబ్ శిక్షణ అందిస్తామని, ఫార్మా, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ టెక్నాలజీ రంగాల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కనీసం 100 కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, విజయవాడలో డెవలప్‌మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.