Page Loader
Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో కొందరు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 18 మంది సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా యాత్రకు బయలుదేరగా, కేదార్‌నాథ్‌ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్‌కు బయలుదేరారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో, కేదార్‌నాథ్‌-బద్రీనాథ్‌ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా, నిజామాబాద్‌, విజయనగరం ప్రాంతాలకు చెందిన యాత్రికులు రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. వర్షాలు, తీవ్ర చలి కారణంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్‌ సర్వీసులు కూడా నిలిపివేశారు.

వివరాలు 

హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రులకు తరలించండి: రామ్మోహన్ నాయుడు

ఈ పరిణామాల నేపథ్యంలో, కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అధికారులతో కూడా చర్చించి, యాత్రికులకు ధైర్యం చెప్పుతూ, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని భరోసా ఇచ్చారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌తో కలిశెట్టి మాట్లాడారు. యాత్రికులను వెంటనే రక్షించాలని కోరుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.