
Andhra Pradesh: స్థిరాస్తి రంగంలోని వారికి గుడ్ న్యూస్.. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్,సేల్ కం జీపీఏ స్టాంపు డ్యూటీ తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
స్థిరాస్తి రంగానికి పుంజుకునే అవకాశాలను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులతో అభివృద్ధి ఒప్పందం(డెవలప్‌మెంట్ అగ్రిమెంట్)లేదా సేల్ కం జీపీఏ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని గరిష్ఠంగా 4 శాతం నుండి కేవలం 1 శాతానికి తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ డ్యూటీలను పెంచిన సంగతి తెలిసిందే. భూముల అభివృద్ధి ఒప్పందాల్లో భూ యజమానులు,బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాల ప్రకారం (ఫ్లాట్లు,వాటాల కేటాయింపు,ఇతర నిబంధనలు) 1 నుంచి 4 శాతం వరకు స్టాంపు డ్యూటీ వసూలు చేస్తుండగా,సేల్ కం జీపీఏ ద్వారా భూమి బదిలీ చేసుకున్నప్పుడు ఆస్తి విలువను ఆధారంగా చేసుకొని 5 శాతం వరకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తుంది.
వివరాలు
ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన నరెడ్కో, క్రెడాయ్ సంస్థలు
2021లో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వుల మేరకు అప్పటి నుంచి ఇదే విధంగా వసూళ్లు జరుగుతున్నాయి. అయితే, ఈ పెరిగిన స్టాంపు డ్యూటీలు భూ యజమానులు, నిర్మాణ రంగ ప్రతినిధులకు ఆర్థికంగా భారంగా మారిన నేపథ్యంలో, నరెడ్కో, క్రెడాయ్ సంస్థలు దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం, పరిస్థితిని అంచనా వేసి, స్టాంపు డ్యూటీని కేవలం 1 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఈ మేరకు తాజా ఉత్తర్వులను విడుదల చేశారు.
వివరాలు
భూ వినియోగ మార్పు ప్రక్రియ మరింత తేలిక
స్టాంపు డ్యూటీలో ఈ తగ్గింపు వల్ల నిర్మాణదారులకు, అలాగే ప్లాట్‌లు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఆర్థిక ఊరట కలుగనుంది. ఫలితంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతేకాక, భూ వినియోగ మార్పులైన నాలా అనుమతుల జారీ బాధ్యతను రెవెన్యూ శాఖ నుండి స్థానిక సంస్థలకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా భూ వినియోగ మార్పు ప్రక్రియ మరింత తేలికపడనుంది.
వివరాలు
పురపాలక,నగరపాలక సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 40 వేల ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు
ఇళ్లను లేదా భవనాలను (నాన్ హైరైజ్డ్) నిర్మించుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'స్వీయ ధ్రువీకరణ పథకం' కింద వెంటనే అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం పురపాలక,నగరపాలక సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 40 వేల ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ అవుతున్నాయి. వీటిలో 100 నుంచి 200 చదరపు గజాల మధ్య స్థలాల్లో పేద,మధ్య తరగతి వారు నిర్మించుకునే ఇళ్లే దాదాపు 80 శాతం ఉంటున్నాయి.