Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన సెప్టెంబరు 22న కన్యాకుమారిలో నిర్వహించిన కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం (లౌకికవాదం) అనే భావన యూరోపియన్ మూలాలు కలిగిందని, భారతీయ సంస్కృతికి ఇది సరిపడదని వ్యాఖ్యానించారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలను మోసం చేశారని, సెక్యులరిజం అనే పదం మన దేశానికి సంబంధించినది కాదని పేర్కొన్నారు.
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చినందుకు విమర్శలు
ఇది యూరోపియన్ చర్చిలు, రాజ్యాల మధ్య ఘర్షణల ఫలితంగా వచ్చిన భావన అని, భారత్‌కు ధర్మం ప్రధానమైనదే తప్ప, సెక్యులరిజం అవసరం లేదని గవర్నర్ వెల్లడించారు. అంతేకాక, 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చినందుకు ఆయన విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో, కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టడానికి సెక్యులరిజం పదాన్ని రాజ్యాంగంలో చేర్చారని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.