పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
పంజాబ్, తమిళనాడు గవర్నర్లు బల్లుల ఆమోదంలో జాప్యం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి వారమైనా గడవకముందే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పది బిల్లులను తమిళనాడు గవర్నర్ వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీటిపై మరోసారి తీర్మానం చేసి పంపేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది.
సుప్రీం కోర్టును అశ్రయించిన డీఎంకే ప్రభుత్వం
గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీ అమోదించి గవర్నర్ కు పంపనున్నట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు పేర్కొన్నారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్ధేశపూర్వకంగానే బిల్లలు ఆమోదంలో జాప్యం చేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక నీట్ పరీక్షను రద్దు చేసే బిల్లును కూడా అంతకముందు గవర్నర్ ఆమోదించకుండానే వెనక్కి పంపిన విషయం తెలిసిందే.