
COVID 19: ఆ కోవిడ్ రోగిని 'చంపేయ్'..ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్.. FIR నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
నాలుగు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి (Coronavirus) ప్రపంచాన్ని హడలెత్తించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విపత్కర పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో అవసరమైనంత సంఖ్యలో పడకలు అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళా కరోనా రోగిని చంపేయాలని ఒక వైద్యుడు తన సహచరుడితో చేసిన సంభాషణ కలకలం రేపుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలు
ఖాళీ పడకలు లేవన్న కారణంతో..
2021లో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రస్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. ఆ సమయంలో పడకలు, ఆక్సిజన్ లభించడం కూడా కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే, అదే ఆసుపత్రిలో ఉన్న మరో వైద్యుడు డాక్టర్ శశికాంత్ డాంగే మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదిరోజులుగా చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా రోగిని చంపేయాలని దేశ్‌పాండే సూచించగా, డాంగే స్పందిస్తూ ఆక్సిజన్ సరఫరాను ఇప్పటికే తగ్గించామని తెలిపాడు. ఆసుపత్రిలో ఖాళీ పడకలు లేవన్న కారణంతో ఈ విధంగా మాట్లాడినట్లు ఆ సంభాషణలో తెలుస్తోంది.
వివరాలు
అసలేం జరిగిందంటే..
ఉద్గిర్ ఆసుపత్రిలో బాధితురాలు సుమారు పది రోజులు చికిత్స పొందింది. ఏడవ రోజు మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త పక్కనే ఉన్న డాక్టర్ డాంగేతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో డాంగేకు డాక్టర్ దేశ్‌పాండే నుంచి ఫోన్ వచ్చింది. లౌడ్‌స్పీకర్ ఆన్ చేసిన డాంగే, ఆసుపత్రిలోని పరిస్థితుల గురించి వివరించాడు. దేశ్‌పాండే, ఆసుపత్రిలో ఖాళీ పడకల పరిస్థితి గురించి అడిగినప్పుడు,ప్రస్తుతం ఖాళీ పడకలు లేవని డాంగే సమాధానమిచ్చాడు. దీంతో దేశ్‌పాండే ఓ మహిళా రోగి పేరును సూచించి, ''ఆమెను చంపేయ్.. నీకు అలవాటే కదా!'' అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మాటలు అక్కడే ఉన్న రోగి భర్త చెవిలో పడటంతో అతడు షాక్‌కు గురయ్యాడు. కానీ అప్పటికి చికిత్స జరుగుతుండటంతో మౌనంగా ఉండిపోయాడు.
వివరాలు
డాక్టర్ దేశ్‌పాండేపై కేసు నమోదు
అయితే కొన్ని రోజుల్లోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జ్ అయ్యింది. అనంతరం ఆమెను ఇంటికి తీసుకెళ్లిన రోగి భర్త ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ ఫోన్ సంభాషణ ఏప్రిల్ 2021లో జరిగినప్పటికీ.. దానికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనివల్ల బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. వెంటనే దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, డాక్టర్ దేశ్‌పాండేపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరో వైద్యుడికి కూడా నోటీసులు జారీ చేశామని, కేసును సమగ్రంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.