Page Loader
Dharani Portal: ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. పరిగణనలోకి రెండు సంస్థలు.. త్వరలో ఉత్తర్వులు?
ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Dharani Portal: ధరణి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. పరిగణనలోకి రెండు సంస్థలు.. త్వరలో ఉత్తర్వులు?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ధరణి పోర్టల్‌లో చోటుచేసుకున్న భూముల అక్రమ లావాదేవీలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించే సంస్థల ఎంపిక, ఏ జిల్లాల్లో దీనిని అమలు చేయాలనే అంశంపై ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్ వేదికగా జరిగిన లావాదేవీలను వెలుగులోకి తెచ్చేందుకు అధునాతన సాంకేతిక నిపుణులు అవసరమని ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. ఇందులో భాగంగా, ఆడిటింగ్ నిర్వహించే సామర్థ్యం గల సంస్థలతో రెవెన్యూ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. తాజాగా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని తెలుస్తోంది.

వివరాలు 

రోజువారీ వేలాది అప్‌లోడ్‌లు 

ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు వేలాది ఈ-ఫైళ్లు అప్‌లోడ్, డౌన్‌లోడ్ అవుతున్నాయి. తహసీల్దారు, జాయింట్ సబ్-రిజిస్ట్రార్, కలెక్టర్ లేదా జిల్లా ధరణి సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ-ఫైలింగ్ ద్వారా లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఈ సమాచారమంతా కేంద్ర సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో లక్షలాది ఈ-ఫైళ్లు నమోదయ్యాయి. అయితే, వాటిలో అక్రమ లావాదేవీలను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఫోరెన్సిక్ ఆడిట్‌ను ఏ కాలానికి సంబంధించిన లావాదేవీలకు నిర్వహించాలి, జిల్లా స్థాయిలో చేయాలా లేదా మండల స్థాయిలోనూ కొనసాగించాలా అనే విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.

వివరాలు 

తొలుత ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండలలో ఆడిట్ 

కలెక్టర్లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చిన పెండింగ్ మ్యూటేషన్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వ భూములకు అక్రమ హక్కులు కల్పించారన్న ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకపోయినా, నకిలీ తీర్పుల కాపీలను తయారు చేసి విలువైన భూములను కొందరు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో, అనుమానాస్పద లావాదేవీల జాబితాను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూముల విలువ పెరిగిన,డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ లావాదేవీలు అధికంగా జరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా,ఉమ్మడి రంగారెడ్డి,హైదరాబాద్,నల్గొండ, మెదక్ జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఎక్కువగా జరిగాయని గుర్తించడంతో, మొదటి దశలో ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

వివరాలు 

అక్రమ లావాదేవీలను అరికట్టడం

ఆడిట్ నిర్వహించే ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసే అవకాశమున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ ద్వారా, అక్రమ లావాదేవీలను అరికట్టడంతో పాటు భూసమస్యలకు స్థిరమైన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.