TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రభుత్వ జీవో.. రాష్ట్రవ్యాప్తంగా అధికారిక మార్గదర్శకాలు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు అంచు గల ఆకుపచ్చ చీరతో సంప్రదాయ తెలంగాణ మహిళా మూర్తిగా రూపుదిద్దుకున్న 'తెలంగాణ తల్లి' విగ్రహానికి అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డిసెంబర్ 9న ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు. ప్రతేడాది డిసెంబర్ 9న "తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు" రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలను రాష్ట్రం, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల జాతీయ గుర్తింపు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రశాంతమైన నడవడిక, సంప్రదాయ చీర ధరించి కనిపించే ఈ విగ్రహం తెలంగాణ సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి
తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. విగ్రహ రూపురేఖలను వక్రీకరించడం, అవహేళన చేయడం నేరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని కాల్చడం, ధ్వంసం చేయడం, సోషల్ మీడియా ద్వారా అవమానించడం వంటి చర్యలు నేరపరమైన చర్యలుగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత బలపరుస్తూ, వారి సాంస్కృతిక పునరుద్ధరణలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.