జర్మనీలో జనసేన నేత నాగబాబుకు అపూర్వ స్వాగతం.. యూరోప్ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో వరుస సమావేశాలు
జనసేన అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఐరోపా దేశాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. యూరప్ పర్యటనలో భాగంగా నాగబాబు ఇవాళ జర్మనీ చేరుకున్నారని ఆ పార్టీ ప్రకటించింది. మ్యూనిచ్ విమానాశ్రయంలో దిగిన నాగబాబుకు జనసేన జర్మనీ ఎన్ఆర్ఐ విభాగం ఘన స్వాగతం పలికారని తెలిపింది. అనంతరం మ్యూనిచ్ లో జన సైనికులు, వీర మహిళలతో నాగబాబు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని వివరించింది. ఇప్పటికే వారం రోజులుగా ఐరోపాలో పర్యటిస్తున్న నాగబాబు, మరో మూడు రోజుల పాటు లండన్ (LONDON - UK)లో పర్యటనను కొనసాగించనున్నట్లు తెలిపింది. మంగళవారం ఐర్లాండ్ దేశంలో పర్యటించిన నాగబాబు, పార్టీకి సంబంధించిన వివిధ సమావేశాల్లో నిమగ్నమయ్యారు.
ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, సహకారం మరువలేనిది : నాగబాబు
ఈ మేరకు జనసేన పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతోనూ వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ అభివృద్ధికి, విస్తరణకు జర్మనీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, సహకారం మరువలేనిదని నాగబాబు కొనియాడారు. పార్టీని పటిష్టంగా నిర్మించేందుకు, భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగా చర్చలు జరపనున్నట్లు పార్టీ చెప్పుకొచ్చింది. కార్యక్రమానికి పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ హాజరవనున్నట్లు చెప్పింది. వివిధ సమావేశాలు, సమాలోచనల అనంతరం జులై నెలాఖరు వరకు ఐరోపాలోని కీలక దేశం నెదర్లాండ్స్ లోనూ పర్యటిస్తారని స్పష్టం చేసింది.