Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు అభ్యర్థుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలతో పాటు, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేశారు. ఈసారి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2011 తర్వాత మళ్ళీ నిర్వహిస్తున్న ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి సీసీటీవీ పర్యవేక్షణతో అన్ని పరీక్షా హాల్స్ లో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.
దివ్యాంగులకు అదనంగా ఓ గంట సమయం కేటాయింపు
పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరాదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే దివ్యాంగులకు అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్యసదుపాయాలతో పాటు, అన్ని కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షల వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.