
Chandrababu: చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు.. రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్.. సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం అనేక ప్రోత్సాహక చర్యలను ప్రకటించింది. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. కేంద్రానికి చెల్లించాల్సిన ఆ మొత్తం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో ప్రత్యేకంగా త్రిఫ్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలను వచ్చే 7వ తేదీ నుంచి అమలులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వివరాలు
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులు
ఇదే రోజున జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సచివాలయంలో చేనేత,జౌళిశాఖలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానంతరం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత గల రంగంగా చేనేత రంగం ఉన్నదని పేర్కొంటూ,ఈ రంగంపై ఆధారపడుతున్నవారికి ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జమ్మలమడుగులో జరిగిన పర్యటనలో చేనేత కుటుంబాలను కలిసినప్పుడు వారు చెప్పిన సమస్యలను ఈ సమీక్షలో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చేనేత ఉత్పత్తులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, మొత్తం 10 జాతీయ అవార్డులు దక్కాయని అధికారులు తెలిపారు. "ఒకే జిల్లా - ఒకే ఉత్పత్తి" విభాగంలో రాష్ట్రానికి తొలిసారిగా అవార్డు లభించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు.