Garbha : గుజరాత్ సంప్రదాయ నృత్యానికి ప్రపంచ కీర్తి.. గార్బాకు యునెస్కో గుర్తింపు
గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యానికి కీర్తి ప్రతిష్ట వచ్చి చేరింది. ఈ మేరకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే యునెస్కో(Unesco) అధికారికంగా గుర్తించింది. ఏటా నవరాత్రుల రోజుల్లో గుజరాత్‌లోని ప్రతీ వీధిలోనూ గార్భా నృత్యం అలరిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఈ నృత్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ఇదే సమయంలో గర్బా రూపంలో మాతృమూర్తికి అంకితం చేసే పురాతన సంప్రదాయం సజీవంగా ఉంటూ మరింత ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌కు గుర్తింపుగా మారిన గార్బాను యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద కింద ఆమోదించిందని వెల్లడించారు.
గుజరాతీయులకు ఇది గర్వకారణం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. యూనెస్కో గుర్తింపుని పురస్కరించుకుని గుజరాత్ ప్రజలకు సీఎం శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. గార్బా నృత్యానికి యునెస్కోపై మోదీ స్పందన : మరోవైపు గార్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ గౌరవం మన దేశ వారసత్వాన్ని, సంప్రదాయాన్ని సంరక్షించుకునేందుకు, అలాగే వీటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు స్ఫూర్తిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.