
Ajit Doval: భారత్‌కు నష్టం జరిగిందా? ఒక్క ఆధారం చూపండి : అజిత్ డోభాల్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా ప్రచారం చేస్తుండటం పట్ల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మండిపడ్డారు. దేశానికి నష్టం జరిగినట్టు చాటేందుకు ఒక్క ఆధారాన్ని చూపించగలరా అంటూ ఘాటుగా సవాలు విసిరారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డోభాల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిందని, స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పామన్నారు. పాక్‌పై భారత్ దాడులు అత్యంత ఖచ్చితంగా, ముందస్తు సమాచారంతో జరిగాయని డోభాల్ స్పష్టం చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ భూభాగంలోని పలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు.
Details
భారత ఆయుధ స్థావరాలపై చిన్న గీత కూడా పడలేదు
ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన 13 కీలక ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయని, వాటి ఫోటోలు అంతర్జాలంలో ఉన్నాయని గుర్తు చేశారు. అయితే, భారత్‌కు నష్టం జరిగిందని చెప్పేందుకు ఏ ఒక్క చిత్రం లేదా ఆధారం లేకపోవడమే అసత్య కథనాల పటాపంచలు చేస్తున్నదని విమర్శించారు. భారత్‌కు చెందిన ఏ ఆయుధ స్థావరం దెబ్బతినలేదు. భారత సైన్యం ఒక్క చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత్ S-400 గగనతల రక్షణ వ్యవస్థతో గాల్లోనే సమర్థవంతంగా తుడిచిపెట్టిందని వెల్లడించారు. భవిష్యత్‌లో యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనే దిశగా దేశీయంగా రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టిందని తెలిపారు.