LOADING...
Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!
ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!

Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలంటే రోగులు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది. రక్త పరీక్షల కోసం ఎక్కువ రక్త నమూనాలు ఇవ్వాలి. ఈసీజీ చేయించుకోవడానికి క్యూలలో నిలబడి ఎదురుచూడాలి. 2డీ ఇకో పరీక్షల కోసం వేరుగా గంటల తరబడి వేచి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఈ ఇబ్బందులకు పరిష్కార మార్గం చూపుతున్నాయి. దిల్లీకి చెందిన క్లినిక్స్‌ ఆన్‌ క్లౌడ్‌ అనే స్టార్ట్‌అప్‌ సంస్థ ఒక ప్రత్యేకమైన హెల్త్‌ ఏటీఎంను అభివృద్ధి చేసింది. ఈ యంత్రం ద్వారా దాదాపు 60 రకాల వైద్య పరీక్షలు చేయవచ్చు. అంతే కాకుండా, ఫలితాలు కొన్ని నిమిషాల్లోనే లభిస్తాయి.

వివరాలు 

రక్త పరీక్షల కోసం కేవలం ఒక బొట్టు రక్త నమూనా చాలు

తెలంగాణ ప్రభుత్వం దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ హెల్త్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ముందు నిల్చున్న వెంటనే ఈసీజీ, హెచ్‌బీఏ1సీ, లిపిడ్‌ ప్రొఫైల్‌, హిమోగ్లోబిన్‌, షుగర్‌, బీపీ, పల్మనరీ ఫంక్షన్‌, హృదయ సంబంధిత పరీక్షలు, డెంగీ, మలేరియా తదితర రోగాల నిర్ధారణ చేసుకోవచ్చు. కొన్ని రక్త పరీక్షల కోసం కేవలం ఒక బొట్టు రక్త నమూనా చాలు.

వివరాలు 

 రెండు ఆసుపత్రుల్లో హెల్త్‌ ఏటీఎం

అదనంగా చెవి, ముక్కు, గొంతు, కంటి పరీక్షలు కూడా ఈ యంత్రంతో చేయవచ్చు. ''మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సూచన మేరకు ప్రస్తుతం ఈ రెండు ఆసుపత్రుల్లో ఓపీకి వచ్చే రోగులకు హెల్త్‌ ఏటీఎం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాటి ఫలితాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ యంత్రాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాం'' అని వైద్య విధాన పరిషత్తు కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ 'ప్రముఖ మీడియా'తో చెప్పారు.