
SUMMER HEATWAVES ACROSS AP: 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి ప్రారంభం కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి.
శుక్రవారం నాటికి 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రమై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యంలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు.
వివరాలు
80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం
శనివారం నాటికి 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
గురువారం నాటికి అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9°C, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ప్రాంతాల్లో 39.9°C, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7°C, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గురువారం మొత్తం 68 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ప్రభావం చూపించాయని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
వేసవిలో జాగ్రత్తలు
వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు పంపేందుకు సెల్‌ఫోన్ నోటిఫికేషన్‌లను ఉపయోగించాలని నిర్ణయించారు.
వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
అత్యంత వేడి గల సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.
అయితే, ఈ ఎండల తీవ్రతకు తోడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.