Page Loader
Himachal Pradesh: ఎడతెగని వర్షాలతో చిగురుటాకులా వణికిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌
ఎడతెగని వర్షాలతో చిగురుటాకులా వణికిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌

Himachal Pradesh: ఎడతెగని వర్షాలతో చిగురుటాకులా వణికిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. సోమవారం ఉదయం నుంచి 24 గంటల్లో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విపరీత వర్షాల కారణంగా వివిధ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.మరో 16 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మికంగా కుంభవృష్టి కురుస్తుండటం వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. మండీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వలన సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. నీటిలో చిక్కుకున్న ప్రజలు, పశువులను రక్షించేందుకు ముప్పుతిప్పులు పడుతున్నారు.

వివరాలు 

స్తంభించిన చండీగఢ్-మనాలీ ప్రధాన రహదారి

ప్రస్తుతం పోలీసు విభాగంతో పాటు జాతీయ విపత్తు ఉపశమన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇక చండీగఢ్ నుండి మనాలీకి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. ఈ రూట్‌లో ఉన్న నాలుగు వరసల రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం తేలికపాటి వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్న వ్యవధిలో భారీ వర్షాలు కురిసే ఉదంతాలు పెరిగిపోతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.

వివరాలు 

వర్షాల ముప్పుతో రూ.50 కోట్ల పంచదార నష్టం 

భారీ వర్షాల కారణంగా హర్యానాలోని యమునానగర్‌ జిల్లాలో ఉన్న సరస్వతి చక్కెర మిల్లుకు తీవ్రమైన నష్టం కలిగింది. వర్షపు నీరు మిల్లులోకి ప్రవేశించి సుమారు రూ.50 కోట్ల విలువ చేసే పంచదారను కరిగిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఆ ప్రాంతంలో 37.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ స్థాయికి 576 శాతం ఎక్కువ అని ఐఎండీ పేర్కొంది.

వివరాలు 

రెండు గోడౌన్లలో 3 నుంచి 4 అడుగుల నీరు 

సరస్వతి షుగర్‌ మిల్లుకు చెందిన సీఈఓ ఎస్.కే. సచ్‌దేవ ఈ ఘటనపై స్పందిస్తూ, "రాత్రి సమయంలో కుండపోత వర్షం కురిసింది. అర్ధరాత్రి మిల్లులో పని చేసే సిబ్బంది మమ్మల్ని అప్రమత్తం చేశారు. మిల్లుకు చేరువగా ఉన్న ఆక్రమిత కాల్వ ఒక్కసారిగా పొంగిపోయింది. ఫలితంగా రెండు గోడౌన్లలో 3 నుంచి 4 అడుగుల వరకూ నీరు చేరిపోయింది," అని చెప్పారు. "దీంతో దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల పంచదార దెబ్బతింది. దీని విలువ సుమారుగా రూ.50 నుండి రూ.60 కోట్ల వరకు ఉంటుంది. మిగిలిన నిల్వలను పరిశీలించిన తర్వాత తుది నష్టాన్ని స్పష్టంగా అంచనా వేయగలుగుతాం," అని ఆయన వివరించారు.