Page Loader
ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు
అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 10, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. దిల్లీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో ఏకంగా 153 మి.మీ వర్షపాతం కురిసింది. 1982 తర్వాత ఈ స్థాయిలో కుంభవృష్టి కురవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటికే దిల్లీ నగరానికి వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. గంట గంటకు యమునా నది ఉప్పొంగనుంది. ఈ మేరకు రాజధాని నగరానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ను తాత్కాలికంగా మూసేశారు.

details

హిమాచల్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్

భారీ వర్షాలతో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరువైంది. దీంతో ఏ క్షణానైనా నది ఉప్పొంగి వరదలు సంభవించే ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని ఏర్పాటు చేశారు. మరోవైపు దిల్లీ, నొయిడా సహా గురుగ్రామ్‌లలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్ లోని బియాస్‌ నది ఉగ్రరూపం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రవాహం ధాటికి పలు చోట్ల వంతెనలు తెగిపోయి, రహదారులు చీలిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు 10 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు.

details

ఉత్తరాఖండ్‌లో నదిలో చిక్కుకుపోయిన బస్సు.. రక్షించిన స్థానికులు

హిమాచల్‌ లో వరద ఉద్ధృతికి పలు చోట్ల ఇళ్లు సైతం కొట్టుకుపోయాయి. భారీ చెట్లు విరిగిపడ్డాయి. అత్యవసరాల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సూచించారు. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాడూన్‌లో ఓ ప్రయాణికుల బస్సు నది ప్రవాహంలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహ ధాటికి బస్సు ఒక పక్కకి ఒరగడంతో బెంబెలెత్తిన ప్రయాణికులు కిటికీల నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆయా బాధితులను రక్షించారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, నివాస ప్రాంగణాలన్నీ జలమయమయ్యాయి. స్పందించిన ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక అధికారులతో కలిసి వరదలో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.