Schools Holiday: రాయలసీమలో భారీ వర్షాలు.. తిరుపతిలో పాఠశాలలకు సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలతో తిరుపతి జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
ఈ ఆదేశాలు అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ ప్రకారం, రేపు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Details
మత్స్యకారులు వెేటకు వెళ్లొద్దు
ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రాబోయే బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
అలాగే, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాగులు, కాలువలు, మ్యాన్ హోల్స్, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు.