
Rain Alert: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి!
ఈ వార్తాకథనం ఏంటి
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది. అలాగే ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అస్థిరంగా ఉండనుందని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Details
హైదరాబాద్ లో జల్లులు కురిసే అవకాశం
ఈరోజు ప్రత్యేకంగా ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అంతేగాక ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి రోజు మేఘావృతమై ముసురు వాతావరణం కనిపించనుంది. అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో అంతరాలుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య తెలంగాణలో మోస్తరు వర్షాలు రోజంతా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.