LOADING...
Rain Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Rain Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు,పశ్చిమ ద్రోణుల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర,మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలుగా ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వాతావరణ శాఖ గుర్తించి, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వివరాలు 

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని, కొన్ని సందర్భాల్లో జల్లులు కూడా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. 

ఈ వర్షాల ప్రభావం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.