AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానల కారణంగా ఉమ్మడి విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో గెడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం,బొబ్బిలి,గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపుకు గురయ్యాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు,జి.సిగడాం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం లావేరు మండలం బెజ్జిపురం నుండి బుడతవలస వచ్చే రహదారి మధ్యలోని సెట్టిగెడ్డలో ఒక సరకుల వ్యాన్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ సాయంతో ఆ వ్యాన్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ,అది సఫలమైంది. డ్రైవరును స్థానికులు రక్షించారు.
గోపాలపట్నంలో విరిగిపడిన భారీ కొండచరియ
జి.సిగడాం మండలం గెడ్డకంచరాం పంచాయతీ కిట్లపేట, గదబపేట, కృష్ణంరాజుపేట గ్రామాలకు గెడ్డకంచరాం వైపు వెళ్లే దారిలో పెద్దగెడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలకు విశాఖపట్టణంలోని గోపాలపట్నంలో భారీ కొండచరియ విరిగిపడింది. జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్ వద్ద, దశాబ్దాల కిందట నిర్మించిన రక్షణ గోడ ఆదివారం మధ్యాహ్నం కొండచరియలతో పాటు కుప్పకూలింది. రెండు ఇళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. అప్రమత్తమైన యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించింది.