Page Loader
Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత ఇంకా తగ్గేలా కనిపించకపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి, ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాజధాని అమరావతి సహా విజయవాడ ప్రాంతాలు నీటమునిగాయి. విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలకు వరద చుట్టుముట్టింది.

Details

వరద నీటిలోనే విజయవాడ, అమరావతి ప్రాంతాలు

బుడమేరులో వరద ప్రవాహం కొనసాగుతోంది, విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉండగా, కృష్ణానది వరద ఉధృతి తగ్గడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్ల గేట్లు ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా నమోదు కాగా, అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సమానంగా 11,25,876 క్యూసెక్కులుగా ఉంది.

Details

హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లో 3,56,024 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 5,00,397 క్యూసెక్కులు నమోదైంది. నాగార్జునసాగర్‌ వద్ద ఇన్‌ఫ్లో 4,61,245 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 4,53,700 క్యూసెక్కులు ఉంది. పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 3,39,434 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 3,14,434 క్యూసెక్కులు ఉంది. పలు జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలు చేరుకుంటున్నాయి, బోట్లు, హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు.