Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకుపోయిన 1000కి పైగా వాహనాలు
ఉత్తర భారతదేశం చలి తీవ్రతతో గజగజా వణుకుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మనాలీ మంచు దుప్పటితో కప్పుకుపోయింది. భారీ హిమపాతంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తాంగ్‌లోని సోలాంగ్, అటల్ టన్నెల్‌ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా మనాలీకి పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించకపోవడంతో, దట్టమైన మంచు కురుస్తుండటంతో వాహనాలు కన్పించని స్థితి ఏర్పడింది. దీనితో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకి కదల్లేకపోయాయి.
700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు
రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక రాజధాని శిమ్లాలో కూడా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని అనేక రహదారులను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబరు చివరి వారంలో మనాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ఈసారి కూడా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.