Jharkand: సీఎంగా నేడు హేమంత్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న పలువురు నేతలు
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (49) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాంచీ లోని మొరాబాది మైదానంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బుధవారం సాయంత్రం హేమంత్ స్వయంగా పర్యవేక్షించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) కూటమి విజయం సాధించింది.
81 మంది సభ్యులున్న అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56 సీట్లు గెలుచుకోగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 24 సీట్లకి పరిమితమైంది.
వివరాలు
ఎన్నికల్లో భార్య కల్పన కూడా విజయం
ఈ ఎన్నికల్లో హేమంత్‌తో పాటు ఆయన భార్య కల్పన కూడా విజయం సాధించారు.
ఆదివారం హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర ఇండియా కూటమి నేతలు హాజరవుతారని అంచనా.
వివరాలు
పూర్వీకుల గ్రామ సందర్శన
హేమంత్ సోరెన్ తన భార్య కల్పనతో కలిసి మంగళవారం బెంగాల్ సరిహద్దులో ఉన్న రామ్‌గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామాన్ని సందర్శించారు.
ఈ గ్రామం హేమంత్ తండ్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ పుట్టిన ఊరు. చిన్నతనంలోనే శిబూ తన తండ్రి సోబరెన్‌ను స్థానిక వడ్దీ వ్యాపారులు చంపారు.
తాత సోబరెన్ సోరెన్ 67వ వర్థంతి సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన హేమంత్ ఆయనకు నివాళి అర్పించారు.
స్థానికులతో మాట్లాడిన హేమంత్, గురువారం నుంచి కొత్త ప్రభుత్వం పని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో సహకరించిన అందరినీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
వివరాలు
ముఖ్యమంత్రిగా నాలుగోసారి
హేమంత్ సోరెన్ తొలిసారిగా 2013 జూలై నుంచి 2014 డిసెంబర్ వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రెండోసారి 2019 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అయితే, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2024 జనవరిలో రాజీనామా చేశారు.
జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చి, మూడోసారి 2024 జూన్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్, గురువారం నాలుగోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు.