Rameswaram: రామేశ్వరం తీరంలో బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా.. ఇద్దరి అరెస్ట్
తమిళనాడు రామేశ్వరంలో ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. పుదుకోట్టైకి చెందిన ఒక మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం రామేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఆచారాల ప్రకారం అగ్నితీర్థంలో సముద్రస్నానం చేసిన అనంతరం, దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లారు. అప్పటికే గదిలో రహస్యంగా దాచిన కెమెరాలు ఆమెకు కనిపించడంతో,ఆమె తక్షణమే కుటుంబసభ్యులకు, ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పరిశీలించిన పోలీసులు,కెమెరాలను స్వాధీనం చేసుకొని,గదిలో ఈ ఘటనకు పాల్పడిన బూత్ నిర్వాహకుడు రాజేష్‌ను అరెస్టు చేశారు.
ఆలయ పరిసరాల్లో తప్పులు జరగకుండా జాగ్రత్తలు
అనంతరం, రాజేష్‌కు సహకరించిన మరో వ్యక్తి, సమీపంలోని టీ స్టాల్‌లో పనిచేసే మీరా మొయిదీన్‌ను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని, ఆలయ పరిసరాల్లో ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ అధికారులు ప్రకటించారు.