
High Court: ఇతర రాష్ట్రాల్లో అప్పట్లో యూనిట్ ధర ఎంత? అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సెకికి హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూనిట్‌కు రూ.2.49 ధరగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించిన వివరాలపై, అప్పట్లో ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ధర ఎంతగా ఉన్నదీ స్పష్టంగా తెలియజేయాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)కు హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సూచించింది. అలాగే, ప్రతిపాదిత యూనిట్ ధరను ఆమోదిస్తూ ఏపి విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ఎదుట సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ఉన్న ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదంపై పిల్స్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సెకి ద్వారా యూనిట్ ధర రూ.2.49కి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించడం చట్టపరంగా సరైందేనా అనే అంశాన్ని సవాల్ చేస్తూ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌లు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేశారు.
వివరాలు
గుజరాత్ ప్రభుత్వానికి యూనిట్ విద్యుత్‌ను రూ.1.99 ధరకు సరఫరా
బుధవారం జరిగిన విచారణలో, పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, "అప్పట్లో మార్కెట్లో యూనిట్ ధర చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రూ.2.49 ధరగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉదాహరణకు, గుజరాత్ ప్రభుత్వానికి యూనిట్ విద్యుత్‌ను రూ.1.99 ధరకు సరఫరా చేస్తున్నారు. సెకి ఒప్పందం అనంతరం రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవాల్సి వస్తోంది. దీని వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. పైగా నిబంధనలకు విరుద్ధంగా, ప్యానెల్ల తయారీ,విద్యుత్ సరఫరా రెండింటినీ కలిపి ఒకే టెండర్ నిర్వహించడం జరిగింది.ఈ ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటు అయితే స్థానికులకు ఉపాధి లభించేది, అలాగే తక్కువ ధరకు విద్యుత్ అందించగలిగే అవకాశం ఉండేది" అని చెప్పారు.
వివరాలు
సెకి నిర్ణయించిన యూనిట్ ధర రూ.2.42కి ఏపీఈఆర్సీ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, "పిటిషనర్లు అప్పట్లో యూనిట్ ధర ఎక్కువగా ఉందనే కారణంతో వ్యాజ్యాలు వేశారు. కానీ చివరికి సెకి నిర్ణయించిన యూనిట్ ధర రూ.2.42కి ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే పిటిషనర్లు సవాల్ చేసుకోవాలన్నారు. సెకి తరఫున న్యాయవాది అనుశ్రీ మాట్లాడుతూ, "రూ.2.42 యూనిట్ ధరకు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం కుదిరింది. ఒప్పందం జరిగిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ధరలు రూ.2.52 నుంచి రూ.2.61 మధ్య ఉన్నవి" అని వివరించారు. ఈ విషయాలను కోర్టు ఎదుట సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరారు.