కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో తన తల్లి గుండెపోటుకు చికిత్స తీసుకుంటున్నట్లు, తాను అక్కడే ఉండాల్సి ఉంటుందని, అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నానని, సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులే ఏకంగా సోమవారం కర్నూలుకు వచ్చారు. ఎంపీ అవినాష్‌రెడ్డి లొంగిపోయేలా చేసేందుకు కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో సీబీఐ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
విశ్వభారతి ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరకున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టూ పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరుకున్న ఆయన మద్దతుదారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యలో భాగంగా సోమవారం ఆస్పత్రి పరిసరాల్లో దుకాణాలు తెరవడానికి పోలీసులు అనుమతించలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి కడప ఎంపీ మద్దతుదారులు కొందరు మీడియా ప్రతినిధులపై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేయడంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.