Supreme Court: 'నిందితుడని ఇళ్లను ఎలా కూల్చివేస్తారు'... బుల్‌డోజర్ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇటీవలి కాలంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపై బుల్డోజర్ పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఈ చర్యలను అక్రమ కట్టడాల కింద చూపించి వాటిని కూల్చివేస్తున్నారు.దీనివల్ల ఈ చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల ఇళ్లను కూల్చివేయడం ఎలా సమర్థవంతమని కోర్టు ప్రశ్నించింది. "ఒక వ్యక్తి కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రనా,అతడి ఆస్తులను ఎలా కూల్చివేస్తారు? ఏ వ్యక్తి దోషిగా నిర్ధారితమైనప్పటికీ,చట్టం నిర్దేశించిన విధానానికి అనుగుణంగా మాత్రమే చర్యలు తీసుకోవాలి.ఎటువంటి అనుమతి లేకుండా ఆస్తులను కూల్చరాదు,"అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పాన్-ఇండియా బేసిస్‌లో మార్గదర్శకాలు
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ, "కేవలం నిందితుడిగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని కూల్చివేయట్లేదు. అది అక్రమకట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నాం" అని వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. "ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే మారే అక్రమ కట్టడాలను మేం రక్షించడం లేదు. అయితే, ఈ కూల్చివేతలకు సంబంధించి పాన్-ఇండియా బేసిస్‌లో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయొచ్చు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం" అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా పడింది.