LOADING...
#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?
ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?

#NewsBytesExplainer: ట్రంప్ $5 మిలియన్ల 'గోల్డ్ కార్డ్'ఎంట్రీ.. భారతీయులపై దీని ప్రభావం ఎంత..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా (Gold Card Visa)ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 5 మిలియన్ డాలర్లు(సుమారు ₹43.54 కోట్లు) వెచ్చించాల్సి ఉంటుంది. దీని ద్వారా నేరుగా అమెరికా పౌరసత్వాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఈ ప్రతిపాదన భారతీయుల్లో ఆందోళనకు దారితీసింది, ఎందుకంటే ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం వేచివున్నవారిలో భారతీయులు అధికంగా ఉన్నారు. కొంతమందికి గ్రీన్ కార్డు పొందడానికి 50 ఏళ్లు పట్టొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో,ట్రంప్ ప్రతిపాదన వల్ల అమెరికా వలస విధానంలో కీలక మార్పులు సంభవించే అవకాశముంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

గోల్డ్ కార్డ్ వీసా అంటే ఏమిటి? 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీసా ప్రతిపాదించారు,ఇది 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలిగిన వారికి నేరుగా పౌరసత్వాన్ని అందిస్తుంది. 2022లో సవరించిన ఈబీ-5 వీసా ప్రకారం, 8 లక్షల నుండి 10.5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించాల్సి ఉండేది. 1992లో కాంగ్రెస్ ఈబీ-5ను ప్రవేశపెట్టింది. కానీ, తాజాగా ప్రతిపాదించిన గోల్డ్ కార్డ్ సంపన్నులకు ప్రాధాన్యతనిచ్చే ప్రీమియం ఆప్షన్‌గా మారవచ్చు. ఇందులో ఉద్యోగ సృష్టి వంటి షరతులు లేకపోవడం గమనార్హం. రష్యా కుబేరులకు కూడా ఈ వీసాను అందుబాటులోకి తేనున్నట్టు ట్రంప్ వెల్లడించారు.

వివరాలు 

భారతీయులపై ప్రభావం? 

అమెరికా గ్రీన్ కార్డు దరఖాస్తుదారులలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. కానీ, ట్రంప్ ఆఫర్ వల్ల ధనిక భారతీయులు వేగంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ మార్పు సాధారణ వృత్తి నిపుణులకు కాకుండా వ్యాపారవేత్తలకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలా ఉంది. గతంలో ఈబీ-5 వీసా ద్వారా పెట్టుబడి పెట్టే వారికి ఇది కష్టతరమైన మార్గంగా మారవచ్చు.

వివరాలు 

ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ఇక లభించదా? 

గోల్డ్ కార్డ్ వీసా ప్రవేశపెట్టడం వల్ల ఈబీ-5 వీసా పూర్తిగా తొలగించబడే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుథ్నిక్ గోల్డ్ కార్డ్ వీసా రెండు వారాల్లో అమలులోకి వస్తుందని ధృవీకరించారు. ఇప్పటికే ట్రంప్ ఈబీ-5 విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కొత్త వీసాతో పోలిస్తే,ఈబీ-5లో పెట్టుబడి మొత్తం 5 రెట్లు తక్కువ. దీంతో చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారులకు ఈ మార్పు ప్రతికూలంగా మారవచ్చు.

వివరాలు 

హెచ్-1బీ, ఈబీ-2/ఈబీ-3 వీసాదారులు దరఖాస్తు చేసుకోవచ్చా? 

5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలిగినవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రంప్ ప్రకారం, ఈ వీసా సంపన్నులు, ధనికుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీలు కూడా తమకు అత్యంత కీలకమైన ఉద్యోగులను ఈ వీసా ద్వారా అమెరికాకు తీసుకురావచ్చు. ఎంత గోల్డ్ కార్డులు జారీ చేస్తారు? ట్రంప్ అంచనా ప్రకారం, సుమారు 10 లక్షల గోల్డ్ కార్డులు విక్రయించవచ్చు. ఒక కోటి గోల్డ్ కార్డులు విక్రయిస్తే, అమెరికా ఆర్థిక లోటును తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమికంగా వీటి జారీకి పరిమితి లేదని పేర్కొన్నారు, దేశానికి భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు రప్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

వివరాలు 

అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరమా? 

ఈ కొత్త విధానం అమలు చేయడానికి అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. అయితే, రాజకీయ ప్రతిపక్షం దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అమల్లో జాప్యం సంభవించవచ్చు. ప్రస్తుతం గోల్డ్ కార్డ్ వీసా నిబంధనలు, ప్రాసెసింగ్ విధానాలు స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే, మరికొన్ని వారాల్లో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ వీసా కోసం అర్హత పొందలేని వారు సాధారణంగా ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3, హెచ్-1బీ వీసాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.