Amitshah Deepfake Video: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో జిగ్నేష్ మేవానీ పీఏ, ఆప్ నేత అరెస్ట్
కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత అమిత్ షా నకిలీ వీడియోను వైరల్ చేసిన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సతీష్ వెర్సోలా అనే నిందితుడిని గుజరాత్‌లోని పాలన్‌పూర్ సమీపంలో అరెస్టు చేశారు. అతను జిగ్నేష్ మేవానీకి పీఏ. కాగా, ఆర్‌బీ బారియాను లింఖేడా నుంచి అరెస్టు చేశారు. అతను ఆమ్ ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా అధ్యక్షుడు. ఈ వీడియో రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఈ ఎడిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్,మరో 16 మంది సోషల్ మీడియా హ్యాండిలర్స్ పై కేసు నమోదు
రిజర్వేషన్‌ను రద్దు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా హ్యాండిల్స్ వీడియోలను షేర్ చేశారు. అదే సమయంలో, నకిలీ వీడియోలను షేర్ చేసినందుకు మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్, మరో 16 మంది సోషల్ మీడియా హ్యాండిలర్స్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై బీజేపీ కార్యకర్త ప్రతీక్ కర్పే ఫిర్యాదు మేరకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బిజెపి ప్రకారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు.