డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద
ఈ వార్తాకథనం ఏంటి
గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
ఈ మేరకు లోతట్టు ప్రజలు, నదీ పరివాహిక ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న మత్స్యకారులు, ఇతర కుటుంబాలు చిగురుటాకులా వణికిపోతున్నారు.
గోదావరిపై నిర్మించిన మరో ప్రాజెక్ట్ ఎల్లంపల్లిది దాదాపు ఇదే పరిస్థితి. ఉత్తర తెలంగాణలోని మిగతా ప్రాజెక్టుల్లోనూ ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.
మరో 24 గంటల్లో అతిభారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో కడెం పరిసరాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
DETAILS
భూపాలపల్లిలో రాత్రంతా ఎత్తైన భవనాలపైనే బిక్కుబిక్కుమన్న ప్రజలు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి వర్షాలకు చాలా ప్రాంతాలను ఇప్పటికే నీరు చుట్టుముట్టింది. వాగులు వంకలు కుంటలు జలపాతాల ప్రవాహం ధాటికి రోడ్లు గల్లంతయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతాలు, మారుమాల గ్రామాలతో పాటు ఇతర పల్లెలకు బయటప్రపంచంతో దారులు తెగిపోయాయి.
భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ప్రవాహానికి మొరంచపల్లి మునిగింది. 6 ఫీట్ల ఎత్తులో వాగు ప్రవహిస్తున్న కారణంగా ఊర్లోకి నీరు చేరింది. ఎత్తైన భవనాలు ఎక్కి ప్రజలు తలదాచుకుంటున్నారు. రాత్రి అంతా బిల్డింగ్‌లపైనే ఉన్నామని జనం వాపోతున్నారు.
మరోవైపు మెదక్, సిద్దిపేట జిల్లాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. సిద్దిపేటలో 14.7 సె.మీ వానలు పడగా, మెదక్‌లో 5.5 సెం.మీ వర్షం కురిసింది. ఈ మేరకు ప్రజలెవరూ ఇళ్లు విడిచి రావద్దని ఐఎండీ సూచించింది.