Page Loader
green pharmacity: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు
గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు

green pharmacity: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టనున్న అయిదు దిగ్గజ ఫార్మా కంపెనీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ఐదు ప్రముఖ ఫార్మా కంపెనీలు (డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, లారస్, ఎంఎస్‌ఎన్‌) 'గ్రీన్ ఫార్మాసిటీ'లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రారంభ దశలో ప్రతీ కంపెనీ 50 ఎకరాల భూమిలో తమ పరిశ్రమను స్థాపించేందుకు ప్రతిపాదనలు పెట్టాయి. బుధవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఈ ఫార్మా కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు వారి ఆసక్తిని మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు.

వివరాలు 

ఫార్మా కంపెనీల్లో 2 లక్షల మంది ఉద్యోగులు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, "మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసి, ఏడాదిలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారం, ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ఈ ఐదు ఫార్మా కంపెనీల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రీన్ ఫార్మాసిటీకి మంచినీరు, విద్యుత్తు సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొంగర కలాన్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మిస్తాం. రహదారి పక్కన మెట్రో రైలు సౌకర్యాన్ని కూడా అందిస్తాం. త్వరలో పారిశ్రామిక విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తాం," అని వెల్లడించారు.

వివరాలు 

టీ-హబ్, డెన్సో మధ్య భాగస్వామ్య ఒప్పందం 

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్‌ సరఫరాదారు డెన్సో, భారతదేశంలోని వాహన రంగంలో కొత్త ఆవిష్కరణలను పెంపొందించేందుకు టీ-హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వాహన రంగంలోని స్టార్ట్‌-అప్స్‌కు మద్దతు అందిస్తూ, అధునాతన పరిజ్ఞానం, మెంటార్‌షిప్‌ అందజేయడం జరుగుతుంది. ఈ అవగాహన ఒప్పందం రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, డెన్సో ఇండియా సీఈఓ యసుహిరో ఐడా సమక్షంలో కుదిరింది. ఆవిష్కరణలకు డెన్సో మద్దతు తెలంగాణలోని అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో ముందుంటున్నారు. వీరికి సహకారం అందించేందుకు డెన్సో మెంటార్‌షిప్‌ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.