నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు
నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, దిల్లీ సహా తదితర రాష్ట్రాలను గత రెండు రోజులుగా వానలు ముంచెత్తుతున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తుతోంది. వరదలో దాదాపుగా 200 మందికిపైగా స్థానికులు చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో సంభవించిన ఈ వర్షాల కారణంగా బగ్గీ వంతెన వద్ద పలువురు టూరిస్టులు సైతం వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు.
వరద నేపథ్యంలో జాతీయ రహదారి మూసివేత : డీఎస్పీ
చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు వరదలో చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు పరాశర్ ప్రాంతం నుంచి వచ్చే క్రమంలో వాహనాలు భారీ స్థాయిలో ప్రభావానికి గురైయ్యాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని డీఎస్పీ సూద్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని పండో - మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిని సైతం మూసేశామని డీఎస్పీ తెలిపారు. సదరు రహదారిని తిరిగి ప్రారంభించేందుకు సమయం పడుతుందన్నారు. వరద ముంపు సమస్య బారిన పడిన ప్రజల్ని ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతామని పేర్కొన్నారు.