విజయవాడలో భారీ వర్షం.. నైరుతి విస్తరణతో చల్లబడుతున్న ఆంధ్రప్రదేశ్
జూన్ మాసం ముగింపు దశలోనూ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి. ఈ మేరకు విజయవాడలో భారీ వర్షం కురవడంతో నగర వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూన్ 11 నుంచే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వద్ద మందగించిన రుతు పవనాలు ప్రస్తుతం చురుగ్గా కదలుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాగల 2, 3 రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారత్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించనుందని స్పష్టం చేసింది.
రానున్న 2 రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన
నైరుతి వేగంగా విస్తరిస్తున్నందున రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఓ వైపు రానున్న 3 రోజుల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉండటం, మరోవైపు కొన్ని జిల్లాలకు వేడి గాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.