ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు జోరుగా వానలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు కుంభవృష్టి కురవనుంది.ఈ మేరకు బుధవారం నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘాలతో కమ్ముకుని ముసురు ఏర్పడింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అనంతరం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. కొత్తవలసలో అత్యధికంగా 113.75 మి.మీ నమోదు కాగా, విశాఖ గ్రామీణంలో 106 మి.మీ రికార్డైంది.
సాగర్‌నగర్ - రాడిసన్ బ్లూ రిసార్టుల మధ్య చెరువుగా మారిన రహదారి
ఆదివారం విశాఖ నగరం తడిసి ముద్దైంది. ఈ మేరకు బీచ్ రోడ్డులోని సాగర్‌నగర్ - రాడిసన్ బ్లూ రిసార్టుల మధ్య రహదారి చెరువును తలపిస్తోంది. రోడ్డును వరద చుట్టుముట్టడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం పాలయ్యారు. నగరంలోని మధురవాడ వద్ద సర్వీస్ రోడ్లు సైతం వర్షం నీటితో చెరువులుగా మారాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మీదుగా కోనసీమ, ఏలూరు, కృష్ణా వరకు సోమవారం భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు గుంటూరు నుంచి బాపట్ల, పల్నాడు మీదుగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం వరకు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
గోదావరికి ఉగ్రరూపం, కృష్ణమ్మకు జలసిరి
మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో గోదావరి నదికి భారీ స్థాయిలో వరద నీరు వస్తోంది. దీంతో రాజమహేంద్రవరంలోని గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 6 గంటలకు 7,96,836 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.అదే రోజు రాత్రి 8 గంటలకు 10.90 అడుగుల నీటి మట్టానికి పెరగడంతో 8,63,562 క్యూసెక్కులను కిందికి వడిచిపెట్టారు. మరోవైపు కృష్ణ నదికీ వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలైంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37,930 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటి మట్టం 809.10 అడుగులతో 33.7658 టీఎంసీలుగా రికార్డైంది.