
New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మరోసారి భారీ రద్దీ ఏర్పడడం కలకలం రేపింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వేగంగా వ్యాపించాయి.
స్టేషన్‌లోని 12, 13వ ప్లాట్‌ఫారమ్‌ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచి ఉండటంతో తొక్కిసలాటను తలపించే పరిస్థితి ఏర్పడింది.
అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
శివగంగా ఎక్స్‌ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, మగధ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవ్వడంతో ఈ రద్దీ మరింత పెరిగింది.
ప్రయాణికుల అధిక సంఖ్యను గమనించిన ఢిల్లీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని అదనపు బృందాలను మోహరించారు. స్టేషన్‌లో పరిస్థితి గందరగోళంగా మారినా ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Details
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న పోలీసులు
గతంలో మహా కుంభమేళా సమయంలో ఎదురైన రద్దీని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిందని దిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు.
ఈ రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. గత నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై రైల్వే శాఖ చర్యలు తీసుకుని ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం తొక్కిసలాట కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.